తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు

  • తిరుమల వీధులు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పౌరాణిక పేర్లు ఖరారు
  • నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం
  • భక్తుల సౌకర్యార్థం రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం
  • ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు
  • అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం యాగశాల
తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక, పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రంలోని మాడ వీధులు, ప్రధాన సర్కిళ్లు, రహదారులకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న మహనీయుల పేర్లను ఖరారు చేసింది. టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ కొత్త పేర్లకు పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడ వీధులకు వేదాల పేర్లతో నామకరణం చేశారు. తూర్పు మాడ వీధిని 'రుగ్వేద మార్గం'గా, దక్షిణ మాడ వీధిని 'యజుర్వేద మార్గం'గా, పశ్చిమ మాడ వీధిని 'సామవేద మార్గం'గా, ఉత్తర మాడ వీధిని 'అధర్వణవేద మార్గం'గా పిలవనున్నారు. వీటితో పాటు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి 'భగవద్రామానుజాచార్య ప్రాంగణం' అని, బేడీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి 'సాళువ నరసింహరాయల ప్రాంగణం' అని పేర్లు పెట్టారు.

అలాగే, తిరుమలలోని ప్రధాన కూడళ్ల పేర్లను కూడా మార్చారు. లేపాక్షి సర్కిల్‌కు 'అన్నమయ్య కూడలి', రామ్‌బగీచ సర్కిల్‌కు 'తొండమాన్‌ చక్రవర్తి కూడలి', ఎస్‌ఎంసీ సర్కిల్‌కు 'పురందరదాసు కూడలి'గా నామకరణం చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు 'తిరువేంకటపథం', ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు 'అన్నమాచార్య మార్గం' అని పేర్లు ఖరారు చేశారు. రామ్‌బగీచ నుంచి పుష్కరిణి వరకు ఉన్న మార్గానికి 'శ్రీ కృష్ణదేవరాయల మార్గం' అని పేరు పెట్టారు.

పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
ఈ సమావేశంలో పేర్ల మార్పుతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాలకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ఆళ్వార్ ట్యాంక్ నుంచి బాట గంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూలైన్లలో రూ.4.55 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించనున్నారు. వరాహస్వామి విశ్రాంతి భవనం-1లో రూ.3.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు అందిస్తున్న ధూపదీప నైవేద్యాల ఆర్థిక సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం రూ.4.75 కోట్ల వ్యయంతో ప్రత్యేక యాగశాల నిర్మించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయాలు తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నాయి.

TTD
Tirumala
Tirumala Tirupati Devasthanams
Srivari Temple
Annamayya
Tondaman Chakravarthi
Purandaradasa
Lord Venkateswara
Alipiri

More Telugu News